Site icon Swatantra Tv

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు

     తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ హౌస్ ఫుల్ అవుతోంది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్య నేతలు కారు దిగి హస్తం గూటికి చేరడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నారు. తాజాగా.. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని యాదయ్య కలిశారు. కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగానే ఉన్నట్లు ఎమ్మెల్యే చెప్పినట్లుగా సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే ఢిల్లీ వేదికగా కాలే యాదయ్య కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

    అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయో లేదో.. ఇలా ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతు న్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో ఉమ్మడి మెదక్‌జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డి కలవడం హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యేలు వరుసగా సీఎంను కలుస్తుండటంతో కారు పార్టీలో అలజడి రేగుతోంది. ఈ మధ్యనే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సభ్యులతో కలవడం.. ఇప్పుడు యాదయ్య కలవడం ఇవన్నీ చూస్తుంటే.. బీఆర్ఎస్‌కు అనుకూల పరిస్థి తులు అస్సల్లేవని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వరుస భేటీలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తునే చర్చనీయాంశం అవుతున్నాయి.

   ఇప్పటికే గులాబీ పార్టీకి కీలక నేతలైన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు గుడ్ బై చెప్పారు. వెంకటేశ్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకోగా, బీబీ పాటిల్, రాములు బీజేపీ గూటికి చేరారు. కాంగ్రెస్‌లో చేరిన వెంకటేశ్ నేతకు సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. మరోవైపు అంతకు ముందు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీతా రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కూడా కారు దిగి కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఇలా లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నాయకులంతా వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశ మవుతోంది. క్లిష్ట సమయంలో కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడంతో కారు పార్టీలో కలవరం మొదలైంది.

Exit mobile version