Site icon Swatantra Tv

కడప గడ్డపై రాజుకున్న రాజకీయ అగ్గి

     కడపలో మండే ఎండలతోపాటు పొలిటికల్ హీట్ పెరిగింది. కడపలో పాగా వేయాలని ఇప్పటికే టీడీపీ జనసేన విస్తృతంగా ప్రయత్నం చేస్తోంది. గత ఆరు పర్యాయాలు అంటే 1994 నుంచి 2019 వరకు కడపలో మైనార్టీ వర్గానికి చెందిన వారే ఎమెల్యేలుగా కొనసాగుతున్నారు. 1994, 99 లలో టీడీపీ నుంచి డాక్టర్ ఖలీల్ బాషా , 2004,09 లలో కాంగ్రెస్ నుంచి అహ్మదుల్లా , 2014,19 లలో వైసీసీ నుంచి అంజాద్ బాషా గెలుపొందారు. ప్రస్తుత ఎమ్మెల్యే అంజాద్ బాషా సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు అవ్వడంతో మైనార్టీ కోటలో అంజాద్ బాషాకు డిప్యూటీ సీఎం, మైనార్టీ శాఖ మంత్రి అయ్యారు. అనూహ్య రీతిలో చంద్రబాబు మాధవిరెడ్డి మహిళను కడప అసెంబ్లీ ఎమెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో కడప గడపలో ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారో . అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

   ఏపి రాజకీయాలు ఎప్పుడు కడప జిల్లా వైపు తిరుగుతాయనడంలో ఎలాంటి సందేశం లేదు. గత ఎన్నికల్లో కడప జిల్లాలో 10కి పది స్థానాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2019 ఎన్నికల్లో కడపలో అంజాద్ బాష టీడీపీ అభ్యర్థి అమీర్ బాబుపై 50 వేలకుపై చిలుకు ఓట్లతో గెలుపొందారు. అంజాద్ బాషాకు మైనార్టీ కోటలో మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి వరించింది. రెండు పర్యాయాలు కడపలో అంజాద్ బాషాకే ఓటర్లు పట్టం కట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కడప అసెంబ్లీ స్థానాన్ని మైనార్టీలకు కేటాయిస్తామని హామీ ఇవ్వడం ఆయన మరణాంతరం జగన్ కూడా ఆ స్థానాన్ని మైనార్టీలకు కేటాయిస్తూ వచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాధవి రెడ్డిని ప్రకటించడంతో కడప రాజకీయం రణరంగంగా మారింది .

   టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి సతీమణి మాధవి రెడ్డి. కడప ఇంచార్జ్ గా మాధవి రెడ్డిని ప్రకటించగానే మాధవి రెడ్డి ప్రచారంతో దూసుకు వెళ్తుంది. రాజకీయాల్లో మొదటి సారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం రావడం వెనువెంటనే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. టార్గెట్ అంజాద్ బాషా గా ప్రచారంలో విమవర్శనాస్త్రాలు గుప్పిస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తీవ్రంగా కృకృషి చేస్తోంది. కడప నగర అభివృద్దిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆస్తులు పెంచుకున్నారే తప్ప, ప్రజలకు చేసిందేమి లేదని బహిరంగంగానే ఆరోపిస్తు న్నారు . 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో తొలి మహిళా అభ్యర్థిగా మాధవి రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు.

     టీడీపీ గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ టీడీపీలో అంతర్గత కలహాలు, వర్గ విబేధాలు కొంత మేర తలనొప్పిగా మారాయి. టీడీపీలో సీనియర్ నాయకులు ఆలంఖాన్, పల్లెలక్ష్మి రెడ్డి కుటుంబానికి టికెట్ వస్తుందని భావించి చివరి నిమిషం లో అదిష్టానం మాధవి రెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో అసంతృప్తి జ్వాలలు రాజుకున్నాయి. గతంలో ఇంచార్జ్ గా ఉన్న అమీర్ బాబు,లక్ష్మిరెడ్డి వర్గం మాధవి రెడ్డికి టికెట్ కేటాయించడాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తు న్నారు. తమ వర్గం నుండి అభ్యర్థిని ప్రకటించే విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు. టికెట్ ఆశించి భంగ పడ్డ వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. టీడీపీ అధిష్టానం స్పందించి అలక పూనిన అభ్యర్థులను ఒక తాటిపై తీసుకురాకపోతే, పార్టీకి తీవ్ర నష్టంవాటిల్లుతుందని స్థానిక నేతలు చేతులెత్తేస్తున్నారు.

   వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషా జగన్ ఇచ్చిన సంక్షేమ, అభివృద్ది పథకాలే తమకు శ్రీరామ రక్ష అని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్న తనకు మరోసారి ప్రజలు గెలిపిస్తారని ధీమాతో ఉన్నారు. టీడీపీ ఇంచార్జ్ మాధవి రెడ్డి నాన్ లోకల్ అని, ఆమె ప్రజలకు అందుబాటులో ఉండరని, వైసీపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం సొంత జిల్లాలో ఎన్నికలను వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కచ్చితంగా మళ్ళీ వైసీపీని గెలిపించుకుని తీరుతామని అంజాద్ బాషా ధీమాతో ఉన్నారు. ముచ్చటగా మూడో సారి అంజాద్ బాషా గెలుస్తాడో లేదో వేచి చూడాల్సిన అవసరం ఉంది. కడప అసెంబ్లీ నియోజికవర్గంలో మైనార్టీలు, బలిజలు ఎక్కువ శాతం ఉండటంతో వారు ఎవరి వైపు మక్కువ చూపిస్తే వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. టీడీపీ జనసేన పొత్తు కలిసి వస్తే విజయ అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే టీడీపీ మైనార్టీల వైపు దృష్టి సారించింది. కడప అసెంబ్లీలో ఎన్నికలు మాత్రం హోరాహోరీగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.ఈ నేపథ్యంలో కడప ప్రజలుఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

Exit mobile version