Site icon Swatantra Tv

మందుబాబులకు షాక్.. 500 మద్యం దుకాణాలు మూసివేత

స్వతంత్ర వెబ్ డెస్క్: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 500 మద్యం దుకాణాలను మూసి వేస్తున్నట్టు ప్రభుత్వ రిటైలర్‌ టాస్మాక్‌ వెల్లడించింది. తొలి విడతలో పాఠశాలలు, ఆలయాల సమీపంలో ఉన్న మద్యం అంగళ్లను మూసివేస్తున్నట్టు తెలిపింది. ఎన్నికల సమయంలో స్టాలిన్‌ సారథ్యంలోని డీఎంకే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే డీఎంకే అధికారంలోకి వచ్చాక మద్యం విధానంలో కీలక మార్పులు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 31 నాటికి 5329 రీటైల్‌ మద్యం దుకాణాలు ఉండగా.. 500 దుకాణాలను తొలుత మూసివేసేందుకు గుర్తించినట్టు ఏప్రిల్‌ 12న సెంథిల్‌ బాలాజీ ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 20న ఇచ్చిన జీవోను ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ గుర్తు చేసింది. ఆ జీవో ఆధారంగానే 500 రీటైల్‌ మద్యం దుకాణాలను గుర్తించి జూన్‌ 22 నుంచి మూసివేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు, ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పట్టాలి మక్కల్‌ కచ్చి (పీఎంకే) పార్టీ స్వాగతించింది. మిగిలిన దుకాణాలను సైతం గడువు లోపు మూసివేయాలని కోరింది.

Exit mobile version