వచ్చే నెలలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దేశమంతా ఆకట్టుకుంటున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయక త్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై దేశమంతా చర్చ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఒంటరిపోరు చేయడం. మరో వైపు భారతీయ జనతా పార్టీ , తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక జట్టుగా ఉన్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీ. ఇక జనసేన సినీ నటుడు పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఉన్న పార్టీ. అంటే వాడుక భాషలో చెప్పాలంటూ మూడు హేమాహేమీ రాజకీయ పార్టీలను ఎదుర్కొంటున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అందుకే ..సింహం సింగిల్‌గానే వస్తుందంటున్నారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు.
గత నాలుగున్నరేళ్లుగా పేద వర్గాల కోసం అనేకానేక సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి సర్కార్ అమలు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్షేమ పథకాల అమలులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఒరవడి సృష్టించింది. మరోవైపు యావత్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల లబ్ది పొందని కుటుంబం అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ఏదో ఒక పథకం కింద దాదాపుగా ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి సొమ్ములు అంద చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఉచితాలే ఈసారి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడబోతున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 19,000 వరకు ఉన్న గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉన్న ఆదరణ మరే ఇతర పార్టీకి లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఈ స్ట్రాంగ్ ఓటు బ్యాంకులోకి ఇప్పట్లో మరో రాజకీయ పార్టీ ఎంటర్ కాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లక్షలాదిమంది ఓటర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన అనేకానేక సంక్షేమ పథకాల వల్ల లబ్ది పొందారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ, జనసేన పేరుకు పొత్తులో ఉన్నా, అధినేతల మధ్య లోపాయికారీగా పొరపొచ్చాలు ఉన్నాయంటు న్నారు రాజకీయ పండితులు. ముఖ్యంగా కూటమి గెలిస్తే …ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య తేడాలున్నాయన్నది రాజకీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తులు జనసేనకు అలాగే జనసేన కార్యకర్తలు టీడీపీకి ఏమేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అందరినీ ఆశ్చర్యపరచిన విషయం టీడీపీ, జనసేనతో పొత్తుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. అయితే ఇది బీజేపీ పెద్దలు చివరిక్షణంలో తీసుకున్న నిర్ణయం. కొన్నేళ్ల కిందట ప్రత్యేక హోదా విషయమై ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగింది. నవ్యాంధ్ర ప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పరిణామం సంభవించింది. అప్పటి నుంచి బీజేపీ ,తెలుగుదేశం పార్టీ మధ్య సత్సంబంధాలు లేవు. తెలుగుదేశం పార్టీని కిలోమీటర్ దూరం లో ఉంచింది భారతీయ జనతా పార్టీ. అయితే చివరిక్షణంలో పవన్ కల్యాణ్ ఒత్తిడిమేరకే టీడీపీ, జన సేన కూటమిలో చేరడానికి బీజేపీ అంగీకరించింది అంటారు రాజకీయ పరిశీలకులు.
చిలకలూరిపేటలో ఇటీవల జరిగిన మూడు పార్టీల బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం తీరును చాలా మంది ప్రస్తావిస్తున్నారు. కూటమిని గెలిపించండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అంతేతప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని వ్యక్తిగతంగా పల్లెత్తు మాట అనలేదు ప్రధాని నరేంద్ర మోడీ. ఇదిలా ఉంటే బీజేపీ ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పార్టీనే నమ్ముతుందని కానీ, తెలుగు దేశం పార్టీని నమ్మదన్న అభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల్లో ఉంది. జగన్ తో బీజేపీకి సమ స్యలు ఉండొచ్చు. అయితే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మధ్య బేరీజు వేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డే ఎక్కువగా నమ్మదగ్గ వ్యక్తిగా బీజేపీ వర్గాలకు కనిపిప్తారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.
గత నాలుగున్నరేళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనేక బిల్లుల విషయంలో జగన్మోహన్ రెడ్డి పార్టీయే మద్దతు ఇచ్చింది.ఈ విషయం బీజేపీ పెద్దలకు తెలియంది కాదు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది భారతీయ జనతా పార్టీ. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పాలనను బీజేపీ రాష్ట్రస్థాయి నాయకులు విమర్శిస్తున్నారు కానీ, హస్తిన పెద్దలు ఎక్కడా పల్లెత్తు మాట అనడం లేదన్న అభిప్రాయం జనంలో నెలకొంది. మరో ముఖ్యమైన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించుకుని తీరాలి. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల మద్దతు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా ఉందంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. అలాగే విశాఖను రాజధానిగా ప్రకటించ డంతో ఉత్తరాంధ్ర అంతా జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పలుకుతోందన్నది సోషల్ సైంటిస్టుల విశ్లేషణ. వీటన్నిటికి మించి ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో సానుభూతి కూడా నెలకొంది. ఒక్క జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికి మూడు రాజకీయ పార్టీలు ఏకమయ్యాయన్న అభిప్రాయం సామాన్య జనంలో కలిగింది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చాలామంది అభిమన్యుడితో పోల్చుతు న్నారు. అలనాటి అభిమన్యుడికి పద్మవ్యూహం ఛేదించడం తెలియదు కానీ…ఇప్పటి రాజకీయ అభిమ న్యుడైన జగన్మోహన్ రెడ్డికి పద్మవ్యూహం ఒక్కటే కాదు… అన్ని కుట్రలను ఛేదించే సామర్థ్యం ఉందంటు న్నారు ఆయన అభిమానులు.


