Site icon Swatantra Tv

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్

       ఎమ్మెల్యే కోటా నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున రంగంలోకి దింపే అభ్యర్థుల ఖరారుపై పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఆయన ఈ నెల 14వ అర్ధరాత్రి దావోస్‌ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆలోపు అభ్యర్థులను ఖరారు చేయడంపై దృష్టి సారించారు. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన రేవంత్‌ ఇదే అంశంపై తన నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలుతో భేటీ అయ్యారు. ఈ రెండు స్థానాలకు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ వాటిపై అధినాయకత్వం ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలిసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్ర నాయకురాలు సోనియాగాంధీలను కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

         రేవంత్‌రెడ్డి ఈ నెల 14న మణిపుర్‌లో మొదలయ్యే రాహుల్‌గాంధీ భారత్‌జోడో న్యాయయాత్ర ప్రారంభ కార్య క్రమంలో పాల్గొని సాయంత్రానికల్లా ఢిల్లీకొస్తారు. ఆ వెంటనే స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు పయనమవుతారు. 21వ తేదీన తిరిగివస్తారు. అయితే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ఈ నెల 18తో ముగియనున్నందున ముఖ్యమంత్రి దావోస్‌కు బయలుదేరే లోగానే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

      గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు సమయంలో సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాల దృష్ట్యా అవకాశాలు కోల్పోయిన వారికి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్‌ యోచిస్తున్నట్లు సమా చారం. ప్రస్తుత మంత్రివర్గంలో మైనార్టీలు లేనందున ఆ వర్గానికి చెందిన వారిని తీసుకొని మంత్రి పదవి ఇవ్వడం వల్ల లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రయోజనం ఉంటుందన్న కోణంలోనూ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ను కలవడానికి అపాయింట్‌మెంట్‌ కోరినట్లు తెలిసింది.

Exit mobile version