Site icon Swatantra Tv

లోక్‌సభ ఎన్నికలకు సమర శంఖం పూరించిన సీఎం రేవంత్‌

     లోక్‌సభ ఎన్నికలకు సమర శంఖం పూరించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తనకు ఎంతగానో కలిసి వచ్చిన ఇంద్రవెల్లి వేదికగా సమరానికి సై అన్నారు. కీలక ప్రకటనలు చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం.. త్వరలోనే రెండు కొత్త పథకాలు ప్రారంభిస్తామన్న ఆయన.. కానిస్టేబుల్ ఉద్యోగాలనూ భర్తీ చేస్తామని వెల్లడించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ జరుగుతున్న ప్రచారంపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి..మా ప్రభుత్వాన్ని పడగొట్టే ధైర్యం చేసేది ఎవరంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీని ఈసారి ప్రధాని చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

           ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపే బాధ్యత తీసుకుంటామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్ర వెల్లిలో జరిగిన తెలంగాణ పునర్నిర్మాణ సభ వేదికగా లోక్‌సభ ఎన్నికల కోసం సమర శంఖం పూరించారాయన. ఇంద్ర వెల్లి మట్టికి గొప్పదనం ఉందన్న సీఎం.. ఇక్కడ వేసే అడుగులో పోరాట పటిమ ఉందంటూ చెప్పుకొచ్చారు. చరిత్ర పుటలో పౌరుషం గురించి చెప్పుకోవాలంటే రాంజీగోండ్ గురించి ప్రస్తావించాలన్న రేవంత్ రెడ్డి.. ఆ పోరాట స్ఫూర్తినే ఆదర్శంగా తీసుకున్నామన్నారు. తాను ఎంతగానో సెంటిమెంటుగా భావించే ఇంద్రవెల్లి నుంచి రెండు కీలక ప్రకటన చేసారు ముఖ్యమంత్రి. త్వరలోనే ఐదువందలకే గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తామన్నారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. ఇక, 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుళ్ల పోస్టు లను భర్తీ చేస్తామని వెల్లడించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలే అయిందని.. అయినా బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.

           దేశంలో ఉన్నది రెండే కూటములు అన్నారు రేవంత్‌. ఒకటి ఎన్డీఏ కాగా మరోటి ఇండియా కూటమి అన్న ఆయన.. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే మోడీ దగ్గర తాకట్టుపెట్టి కేసీఆర్ గులాంగిరీ చేస్తారని ఆరోపించారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదన్నారు రేవంత్ రెడ్డి. అన్ని వర్గాలను నట్టేట ముంచిన కేసీఆర్‌కు ముఖ్య మంత్రి పదవి కాదు కనీసం మంత్రి పదవి కూడా రాదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.ఈసారి ఎన్నికల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్. అలా జరగాలంటే ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ప్రజలను కోరారు రేవంత్.

Exit mobile version