Site icon Swatantra Tv

మూడు పార్టీలకూ సవాల్.. నిజామాబాద్ ఎంపీ

        మూడు ప్రధాన పార్టీలకూ సవాల్ గా నిలిచే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొద లైంది. ప్రధాన పార్టీలు సమరానికి సై అంటున్నాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు సిద్ధంచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన పార్టీ పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నాలు చేస్తుంటే.. అధికారం అందుకున్న పార్టీ అదే జోష్ కొనసాగిస్తూ విజయమే లక్ష్యంగా సాగుతోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తామేమీ తక్కువ కాదంటూ మోదీ చరిష్మతో మరోసారి ఎంపి సీటును తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంతకీ నిజామాబాద్ పార్లమెంట్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు. ఏ పార్టీ పరిస్థితి ఏంటి. రానున్న పార్లమెంట్ లో నిజామాబాద్ బాదుషా ఎవరు?

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడటంతో ప్రధాన రాజకీయ పార్టీలు మరో సమరానికి సన్నద్ధమవుతున్నా యి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పోరు ముగియడంతో రానున్న పార్లమెంట్ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి సారించా యి. ఇందులో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలో గతంలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ, కాంగ్రెస్, బీజేపీలు గణనీయమైన ఓట్లను శాసన సభ ఎన్నికల్లో సాధించడంతో పాటు బిజెపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో రెండు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నా యి . దీంతో రానున్న ఎంపీ ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి.

      నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలుండగా అందులో 5 నిజామాబాద్ జిల్లాలో, 2 జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీలలో ఇటీవల బీఆర్ఎస్ విజయం సాధించగా నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండలో బీఆర్ఎస్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్లలో బీజేపీ, నిజామాబాద్ రూరల్, బోధన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. పార్లమెంట్ పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీఆర్ఎస్, రెండింటిలో కాంగ్రెస్, రెండింటిలో బీజేపీ గెలుపొందింది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్లమెంట్ పోరుకు సిద్ధమవుతోంది. నిజామాబాద్ పార్టమెంట్ కు ఆ పార్టీ తరపున సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఇన్ చార్జీగా నియమించింది. నిజామాబాద్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మరో సారి సత్తా చాటడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొంది గులాబీ జెండా ఎగురవేయడానికి బీఆర్ఎస్ గట్టి కృషి చేస్తోంది. దీంతో నిజామాబాద్ పార్లమెంట్లో త్రిముఖ పోటీ గ్యారంటీ.

       శాసన సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు సాధించాలనే వ్యూహంతో ఉంది. శాసన సభ ఎన్నికల్లో జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ స్థానాల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ అదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కిపై బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం సాధించి తొలిసారిగా గులాబీ జెండా ఎగురవేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బిజేపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో కవిత ఓటమి పాలయ్యారు. ఈసారి నిజామా బాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కవిత పోటీకి దూరంగా ఉంటారని ప్రచారం జరుగుతోంది. కవిత పార్లమెంటు స్థానం లో పోటీకి దూరంగా ఉండటంతో ఆ స్థానం నుండి పోటీ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మొన్నటి వరకూ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ ఎంపీకి పోటీ చేస్తారని, అరవింద్ ని మట్టి కరిపించి ప్రతీకారం తీర్చు కుంటుందని బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన అధికార మార్పుతో కవిత పోటీకి దూరంగా ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది . బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే నాయకుడే లేకపోవడంతో కవితనే ఒప్పించి పోటీకి దించే ఆలోచనలో అధిష్టానం ఉంది.

           పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అలాగే నిజామాబాద్ రూరల్, బోదన్ అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. మిగిలిన 5 నియోజకవర్గాల్లో గణనీయంగా ఓట్లు పెంచుకుంది. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండో స్థానం, కోరుట్లలో మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన జోష్ ను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని చూస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2004, 2009లో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందిన మధు యాష్కి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ల్బీ నగర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఇటీవల ఓ సందర్బంలో మధుయాష్కి తాను వచ్చే పార్లమెంట్ ఎన్ని కల్లో పోటీ చేయనని ప్రకటించారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎ మ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయన్నఅభిప్రాయాన్ని మధు యాష్కి వెలిబుచ్చడం విశేషం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి పోటీ చేస్తారా కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా అన్న చర్చ సాగుతోంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సినీ నిర్మాత దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో ఉంటారనే ప్రచారం జోరుగా ఉంది. దిల్ రాజు పోటీకి సుముఖంగానే ఉన్నట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయకపోతే దిల్ రాజుని రంగంలోకి దించే అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

      మరో పక్క ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి, తీసుకున్న నిర్ణయాలే తమకు ఓటు బ్యాంక్ గా మారుతాయని కమల నాథులు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ విజయం సాధించింది. ఎంపీ ధర్మపురి అరవింద్ మరోమారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్లలో రెండో స్థానంలో, జగిత్యాలలో మూడో స్థానంలో నిలిచినప్పటికీ గతంలో కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. ప్రధాని మోదీ పసుపు బోర్డు పై చేసిన ప్రకటన తనకు అనుకూలంగా మారుతుందని బీజేపీ భావిస్తోంది. పార్ల మెంట్ పరిధిలోని అయిదు నియోజకవర్గాల్లో ఎక్కువగా పసుపు సాగు అవుతుండడం కలిసివస్తుదని అంచనా. ఓటు బ్యాంక్ పెరగడంతో పాటు, పార్లమెంట్ పరిధి లోని ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ లో విజయం సాధిచడంతో పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమాతో బీజేపీ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలకు నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ అంశం ప్రధాన ఎజెండాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోరుట్ల నియోజకవర్గం పరిధిలోని ముత్యంపేట, నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎన్డీఎస్ఎల్ మూతపడి ఏళ్లు గడుస్తున్నా తిరిగి తెరుచుకోలేదు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశంపై ప్రధాన రాజకీయ పక్షాలు దృష్టి సారిస్తున్నాయి. పసుపు రైతుల సమస్యలు, గల్ఫ్ సమస్యలు ప్రధాన ఎజెండాగా మారుతాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మూడు పార్టీలకు కీలకంగా మారనుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి మద్దతునిస్తారో వేచి చూడాల్సిందే మరి.

Exit mobile version