Site icon Swatantra Tv

ఏపీలో పెన్షన్ టెన్షన్

శాసనసభ ఎన్నికల్లో గెలవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వదులుకోవడం లేదు. ఇక విషయంలోకి వస్తే….ఇటీవల వాలంటీర్ల సేవలపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడం కుదరదంటూ ఈసీ పేర్కొంది. అంతిమంగా వాలంటీర్ల సేవలపై ఈసీ ఆంక్షలు విధించింది. దీంతో పెన్షన్‌లకు సంబంధించిన ఈ అంశాన్ని కూడా అస్త్రంగా చేసుకుంటోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.

అసలు జరిగిందేమిటంటే సహజంగా వలంటీర్లు అందరూ అధికారపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందినవారు. దీంతో ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలంటే వాలంటీర్లను పోలింగ్ విధులకు దూరంగా ఉంచాలంటూ సిటిజన్ ఫర్ డెమొక్రసీ సంస్థ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్లను ఎలక్షన్ డ్యూటీకి దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది. అయితే పెన్షన్‌లను ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసుకోవచ్చని సర్కార్‌కు ఈసీ సూచించింది. ఇదిలా ఉంటే పెన్షన్‌ల పంపిణీకి కేవలం 48 గంటలు ముందుగా ఎలక్షన్ కమిషన్ ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే మార్చి 31వ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దీనిపై ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేకపోయింది. ఈ విషయంలో జాప్యం జరిగింది. ఈ జాప్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పెన్షనర్ల ఓట్ బ్యాంక్‌ను ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చుకుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.వాలంటీర్ల సేవలపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించడంతో వృద్దులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇదంతా తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చిన ఇబ్బందేనని ఊరూవాడా ప్రచారం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి శిబిరం. రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీపైనా బురద చల్లే కార్యక్రమం చేపట్టింది. సామాన్య జనం ముందు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని పెన్షనర్ల ముందు దోషిలా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతినెలా పెన్షన్‌లు తీసుకునే వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికాలాంగులు, ఇతరులు కలిపి దాదాపు 66 లక్షల మంది ఉన్నారు. ఈ పెన్షనర్లను తమకున్న అతి పెద్ద ఓటు బ్యాంకుగా భావిస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీరందరి ఇళ్లకు ప్రతి నెలా ఒకటవతేదీన తెల్లవా రుజాము నుంచే వాలంటీర్లు వెళతారు. పెన్షన్‌కు సంబంధించిన సొమ్మును వారి చేతుల్లో పెడతారు. ఇది చాలా కాలం నుంచి నడుస్తున్న ప్రక్రియ. ఈ ప్రక్రియ పెన్షన్‌దారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షనర్లకు వాలంటీర్లు నగదు అందచేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వాలంటీర్ల సేవలపై ఎలక్షన్ కమిషన్ విధించిన ఆంక్షలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికారపార్టీ అయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందుకు అనుగుణంగా వ్యూహాలు రూపొందిస్తోంది. అయితే పెన్షన్లు అందచేయడంలో జాప్యం జరి గింది. దీంతో పెన్షన్‌దారులకు నగదు అందలేదు. చివరకు వృద్దులు ఇబ్బందులు పడ్డారు. దీంతో పెన్షన్‌దారుల ఇబ్బందులకు ప్రతిపక్షాలే కారణమంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విష ప్రచారం మొదలెట్టింది. చంద్రబాబు అండ్ టీమ్ నిర్వాకం వల్లనే అవ్వా, తాతలకు పెన్షన్లు అందడం లేదని జగన్ శిబిరం మొసలి కన్నీరు కారుస్తోంది. పెన్షనర్ల సానుభూతి పొందడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా వాలంటీర్లు రాజీనామా బాట బట్టారు. మచిలీ పట్నం నియోజక వర్గంలో దాదాపు 1200 మంది రాజీనామా చేశారు. అలాగే తాడిపత్రిలో 300 మందికి పైగా రాజీనామా చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చౌటపల్లి గ్రామ వాలంటీర్లు 11 మంది రాజీనామాలు చేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఈ రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఇదిలాఉంటే రాజీనామాలు చేస్తున్న వాలంటీర్లు ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. ఎన్నికల తరువాత తిరిగి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సర్కార్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు వాలంటీర్లు. తిరిగి తమకు వాలంటీర్ల ఉద్యోగాలు వస్తాయన్న భరోసాతో ఉన్నారు. ఈ మేరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుల నుంచి వాలంటీర్లకు హామీ లభించిందని తెలుస్తోంది. కాగా ఎన్నికల్లో వాలంటీర్ల సేవలు వాడుకోవడానికే వారితో జగన్ శిబిరం రాజీనామాలు చేయిస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఎన్నికలు తరుముకు వస్తున్న ప్రస్తుత తరుణంలో వృద్ధుల పెన్షన్ టెన్షన్, వాలంటీర్ల రాజీనామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

Exit mobile version