Site icon Swatantra Tv

ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. నిలిపివేసిన ఖాతాలకు క్షమాభిక్ష

ట్విటర్‌లో పలు మార్పులు తీసుకొస్తున్న కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు కారణాలతో గతంలో నిలిపివేసిన ఖాతాలకు ‘క్షమాభిక్ష’ పెడుతున్నట్లు ప్రకటించారు. వచ్చేవారం నుంచే ఆ ఖాతాల పునరుద్ధరణ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు.

ట్విటర్‌లో నిలిపివేసిన ఖాతాలకు ‘క్షమాభిక్ష’ పెట్టాలా? వద్దా? అన్నదానిపై మస్క్‌ గురువారం పోలింగ్‌ నిర్వహించారు. ఈ పోలింగ్‌లో 31.6లక్షల మంది పాల్గొన్నారు. 72.4శాతం మంది అనుకూలంగా ఓటెయ్యగా.. 27.6శాతం మంది వ్యతిరేకించారు. అత్యధిక మంది క్షమాభిక్షకు ఓకే చెప్పడంతో మస్క్‌ ఆ ఖాతాలను పునరుద్ధరించేందుకు సిద్ధమయ్యారు. ‘‘ప్రజలు చెప్పారు. వచ్చేవారం నుంచి ఈ క్షమాభిక్ష మొదలవుతుంది. ప్రజల మాటే.. దేవుడి మాట’’ అని మస్క్‌ నేడు ట్వీట్‌ చేశారు.

విద్వేషపూర్తిత పోస్టులు లేదా నకిలీ సమాచార వ్యాప్తి తదితర కారణాలతో గతంలో పలువురి ఖాతాలను ట్విటర్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇందులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే ట్విటర్‌ను మస్క్‌ హస్తగతం చేసుకున్న తర్వాత.. ఆ ఖాతాలను పునరుద్ధరిస్తారని ఊహాగానాలు వచ్చాయి. అన్నట్లుగానే ఇటీవల.. ట్రంప్‌ ఖాతాను పునరుద్ధించేందుకు పోలింగ్‌ పెట్టారు. మెజార్టీ నెటిజన్లు అనుకూలంగా ఓటెయ్యడంతో ఆయన ఖాతాను మళ్లీ యాక్టివ్‌లోకి తెచ్చారు.

ఇదిలా ఉండగా.. ట్విటర్‌లో వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మస్క్‌కు కొత్త చిక్కులు మొదలయ్యాయి. వీటిని పరిష్కరించేందుకు ఆయన కొత్త వారిని నియమించుకుంటున్నారు. తాజాగా ట్విటర్‌ సెర్చ్‌లో తలెత్తిన సమస్యను సరిచేసేందుకు జార్జ్‌ హోట్జ్‌ అనే వ్యక్తిని నియమించినట్లు సమాచారం. 2007లో ఐఫోన్‌ హ్యాక్‌ చేసిన తొలి వ్యక్తిగా జార్జ్‌ హోట్జ్ పాపులర్‌ అయ్యారు.

Exit mobile version