ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మితమైన రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో రామ్ లల్లాను దర్శించుకుంటున్నారు. అయోధ్యాపురి మొత్తం భక్తులతో నిండిపోయింది. ఇసుకవేస్తే రాలనంత జనం ఉన్నారక్కడ. గడ్డ కట్టించే చలిని సైతం లెక్కచేయట్లేదు.
గతేడాది జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడి జన్మస్థలం అయిన అయోధ్యలో ఆయన కొలువుదీరిన రోజు. నగుమోముతో బాల రాముడిగా కనులవిందుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు. జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఆరంభమైంది. 12 గంటలు 31 నిమిషాలకు పూర్తయింది. 86 సెకెండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ముగించారు అర్చకులు. అభిజిత్ ముహూర్తంలో రామ్ లల్లా విగ్రహానికి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ జరిగింది. నేటితో ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏడాది పూర్తయింది. గతేడాది జనవరి 22న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగ్గా… 10 రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. దీనికి కారణం హిందూ క్యాలెండర్ ప్రకారం… అప్పటి ప్రాణప్రతిష్ఠ తిథి, ముహూర్త లగ్నం ప్రకారం చూసుకుంటే ఆ శుభదినం నేడే.
అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అయోధ్య నిండిపోయింది. బాల రాముడిని దర్శించుకోవడానికి ఆలయాలనికి పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే ఆలయం ప్రాంగణం ముందు బారులు తీరారు. ఆరు డిగ్రీల చలిని సైతం లెక్కచేయకుండా ఆ బాలరాముడి దర్శనం కోసం క్యూ కట్టారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ గేట్లు తెరవగా… ఆ ప్రాంతం అంతా జనసంద్రంగా మారిపోయింది.